మీరు కూడా ఒక ఎన్.ఎస్.జి కమాండొ కండి.

యుద్ధంలో ఉన్న మన సైనికుల కోసం వారం లో ఒక పూట స్వచ్చందంగా ఆహరాన్ని తీసుకోవడం మానేసే వారం.  అంటే పస్తు ఉండేవాళ్ళం.  ఆ రోజున మా వంతు భోజనం మానేసి  వారికి పెట్టినంత సంబరం పడే వాళ్ళం.  తలచుకుంటుంటే ఇప్పుడు కూడా ఎంత సంతోషంగా ఉందో.

అది ఒక నలు చదరపు పాక.  నాలుగు మూలలు.  నాలుగు స్థంభాలు.  దాని మీద వెదురు బొంగులతో కప్పు.  కొబ్బరి ఆకులతో కప్పేసి ఉండేది.  నాలుగు స్థంభాల మధ్య గచ్చు.  చుట్టూ ఉన్న ప్రదేశానికంటే బహుశ ఒక అడుగు ఎత్తులో ఉండేదేమో ఆ గచ్చు.  పాక చుట్టు మొక్కలు. కొన్ని కుండీలలో ఉండేవి. వాటిలో కొన్ని పూల మొక్కలు.  మొక్కలే ప్రహరి.  ఆ మొక్కల మధ్యలో ఒక చోట కొంత ఖాళీ ఉందేది.  ఆ ఖాళీ మధ్యనుండి మా క్లాసులోకి దారి.  రెండు అడుగులు వేస్తే, అక్కడ ఒక చిన్న మెట్టు.  ఆ మెట్టు ఎక్కితే మా క్లాసులోకి ప్రవేశం.

సైన్స్ టీచర్ పాఠాలు చెబుతున్నారు.  ఇంతలో హఠాత్తుగా సైరన్ మోగడం మొదలైంది.  ఎక్కడి వాళ్ళం అక్కడే గచ్చుమీదకి జారుకున్నాం.  స్థంభానికి దగ్గిర ఉన్నవాళ్ళు ఆ స్థంభం దగ్గిరకి చేరుకోవాలి. స్థంభానికి వెన్ను ఆనించి కూర్చోవాలి. మోకాళ్ళు ముడుచుకుని, ఛాతికి దగ్గిరగా లాక్కుని, తలని మోకాళ్ళ మధ్యకి దూర్చి, చేతులతో మోకాళ్ళని చుట్టుకోవాలి.  అంటే ఒక విధంగా, కూర్చుని మూడంకే వెయ్యడం. శరీరాన్ని కుంచించుకోవడం మూలంగా  మన మీద పడే వస్తువుల నుండి మనం మనల్ని కాపాడుకోగలుగుతాం.  ఇక స్థంభం మన వెన్నుకు రక్షణ కలిగిస్తుంది.

క్లాసు మధ్యలో ఉన్నవారు ఆరుబయటకు పరుగెత్తాలి.  వొంగి పరుగెత్తాలి.  అక్కడ, నెల మీద బోర్లా పడుకోవాలి.  తల వెనుక భాగాన్ని అరిచేతులతో కప్పుకోవాలి.  మళ్ళీ సైరన్ మోగేంత వరకు ఎక్కడి వారు అక్కడే గప్ చుప్.  స్నానాల గదులలో ఉన్నవారు, భోజనాలు చేస్తున్నవారు, ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే – అది డ్రిల్లు.

చీకటి పడిన తరువాత సైరన్ మోగితే, దీపాలు ఆర్పెయ్యాలి.  ఒక వేళ దీపాలు వెలిగించాల్సి వస్తే ఆ వెలుతురు బయటకు కనపడకుండా కిటీకీల కు ఆ జల్లీలకు నల్లటి కాగితం అంటించి  పెట్టుకోవాలి,  ఎక్కడా వెలుతరన్నది కనపడకుండా.  మళ్ళీ సైరన్ మోగేంత వరకు.  అది డ్రిల్లు.

సైరన్ ఎప్పుడు పడితే అప్పుడు మోగేది.  దానికి ఒక వేళ పాళ ఉండేది కాదు.  రోజుకి ఒక్కసారే కాదు.  రెండు మూడు సార్లు మోగేది.  పగలు మోగితే రాత్రి మోగదని కాదు.  అలాగని రాత్రి మోగితే పగలు మోగదని  కాదు.  రోడ్డు మీద బస్సులు ఆగి పొయ్యేవి.  సైకిళ్ళు దిగి పడుకునే వారు.  కారులు దిగి రోడ్డు పక్కకి జారుకునేవారు.

శత్రువు ఎటునుంచి వస్తాడో తెలియదు.  సముద్రం ద్వార జలాంతర్గామిలో వచ్చి బాంబు వేసేయ్యగలడు.  ఆకాశమార్గం నుండి విమానాలలో వచ్చి బాంబులు విసిరేసి పారిపోగలడు.  పదాతి దళాలు తుపాకులతో కాల్చడం మొదలు పెడితే, నేల మీద పడుకుని తప్పించుకోవాలి. అందుకనే ఆ డ్రిల్లు.

మేము పిల్లలం ఐనా, శత్రువుని చూసి భయపడి పారిపోకుండా నిలబడగలం అనే  ధైర్యం ఇచ్చేది ఆ డ్రిల్లు.  ఆ డ్రిల్లు మాకు అలా ఉపయోగ పడింది. వారంలో ఒక రోజో, ఒక పూటో స్వచ్చందంగా ఆహరాన్ని మానేయ్యడం – అది మన సైనికులకోసం కదా అని అనుకున్నప్పుడు కలిగే మానసిక ఆనందం వర్ణానాతీతం.  ఆ యుద్దంలో మేము కూడా పాలు పంచుకుంటున్నామన్నంత సంబరంగా ఉండేది.  మేము కూడా మన దేశానికి సేవ చేస్తున్నమనే అనుభూతికి లోనయ్యే వాళ్లం.

ఏది ఆనుభూతి ఈ రోజున?

మనం మన సైనికులని మరిచిపోలేదా/

మనకంటూ ఒక దేశం ఉంది, మనం దానికోసం ఏం చేస్తున్నాం అని ప్రశ్నించుకుంటే వచ్చే జవాబు మనకి సంతృప్తిని ఇస్తూన్నదా?

* * *

Taj dome is burning

కటువుగా ఉండవచ్చు వినడానికి మీకు.

కర్‌కరే, ఆశోక్ కామ్తే, సదానంద్ డాటే, విజయ్ సలస్కర్ లాంటి ఉన్నతాధికారులు, అనుభజ్గ్ఞులు, అలా వెళ్ళిపొయ్యి ఇలా బలైపోతారా? వాళ్లకి సరైన నిఘా నివేదికలు, శిక్షణలు, ఆయుధాలు ఉన్నవా? ఒక తూటాని ఆపలేని శిరస్త్రాణాన్ని ఇచ్చి వారిని యుద్ధానికి పంపుతారా?  ఎంత సిగ్గు చేటు?అవి ఉండి ఉంటేవారిలా మృత్యువాత పడేవారా అనేది సందేహాస్పదం.

* * *

శివరాజ్ పాటిల్ రాజీనామ చేసాడంట?  ఐతే ఏవిటంట?

అతనికి దేశభక్తి లేదు కాబట్టి అతన్ని దిగిపొమ్మనారంట.  పాటిల్ కి దేశభక్తి ఉండి ఉంటే, ముంబైలో ఆ ఉగ్రవాదులు ౬౦ గంటలపాటు విధ్వంసాన్ని సృష్టించగలిగేవారు కారన్నది కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం.

వాళ్ల స్వార్ధ రాజకీయాలకోసం మనల్ని తాకట్టు పెడుతున్నారు ఈ కుళ్ళి, కంపుకొడుతున్న, తమ తండ్రులేవరో తెలియని రాజకీయ నాయకులు.

* * *

మనం మారాలి.

మనతో పాటు మన వ్యవస్థ మారాలి.

ఆ వ్యవస్థకు తగిన నాయకులను కావాలి.

అటువంటి నాయకులని మనం గుర్తించాలి.

వారిని మనం ఎన్నుకోవాలి.

మన చేతిలో ఓటు ఉంది.

రేపటి ఎన్నికల రణ రంగంలో మనం ఒక సుక్షితుడైన ఎన్.ఎస్.జి కంమెండో లాగ ఒక చక్కని నాయకుడిని ఎన్నుకుందాం.

ఆ ఎన్నికలో, మన కోసం ప్రాణాలొడ్డిన వారందరిని స్మరించుకుంటూ – మన వ్యవస్థకు పట్టిన చీడపురుగులను ఏరి పారేసి వారిని తుదముట్టిద్దాం.  శత్రుశేషం ఉంచరాదు.

ఒక సరికొత్త బంగారు భవిష్యత్తుని నిర్మించుకుందాం. దాన్ని మన పిల్లలకందిద్దాం!

అప్పుడే ఎన్.ఎస్.జి కమెండో ఉన్నికృష్ణన్ వీరోచిత మరణానికి మనం న్యాయం చేసినవారమవుతాం!

దానికి ఇప్పటినుంచే ప్రణాళిక వేసుకుందాం.

మీ చేతిలో ఓటు ఉంది.

అదే  మీ ఏ.కే 47.

మీరు కూడా ఒక ఎన్.ఎస్.జీ కమాండొకండి.

ఒక చక్కని నాయకుడిని ఎన్నుకోండి!

తాజా కలం: నెటిజన్ “ఒక మంచి అభ్యర్ధిని ఎన్నుకోవడం ఎలా?” అని ఒక టపా ప్రచురించారు. (అది ఈనాడు సౌజన్యం అనుకుంటాను)  దాన్ని చదవండి.

Loading image

Click anywhere to cancel

Image unavailable

Loading image

Click anywhere to cancel

Image unavailable

ప్రకటనలు