” నిన్నేలా మరిచి పోతాను బావా?”

సాయంత్రం రాగానే ఫ్రిడ్జ్ మీద ఉంది ఆ కవరు.  తెలుస్తునే ఉంది, వెడ్డింగ్ ఇన్వైట్ అని.  ఎవరిదబ్బా,  పోస్ట్ లో పంపారు.  నా పోస్టల్  అడ్రెస్స్ ఎవరిదగ్గిరుందా అని అనుకుంటూ ఎడమ చేత్తో అందుకున్నాను.  ఫ్రం నాగ రాజు అది. నిట్టుర్పూ.  ఎప్పటి నాగ రాజు. ఎక్కడి నాగ రాజు.  నాగ రాజు కి నా అడ్రస్సు ఎక్కడిది. నా పుర్తి పేరు నాగరాజుకి తెలిసే అవకాశం లేదు.  ఐనా   నా అడ్రస్సు తెలిసుంటే, అవకాశం దొరికితే నన్ను అడ్డం గా నరికెయ్యడూ?    దస్తూరి ఎవరిదో అని చూసాను.  “పెద్దా” దా?  ఏమో? పెద్దాదో అతని సోదరుడిదో?  చాలా రోజులయ్యింది వాళ్ళ దస్తూరి చూసి.  పెద్దాదే అయిఉండవచ్చు.  అతనే నా పోస్టల్ అడ్రస్సు అడిగి మరీ తీసుకుంది.  గుర్తున్నానన్నమాట. నన్ను కలుద్దామని ఉండి ఉంటుంది.  తనకి తెలుసు వాళ్ళ నాన్న అంటే నాకు చాల ఇష్టం అని, మా అమ్మకి కూడ తన అన్నయ్య అంటే ప్రేమ అని. అఫ్‌కోర్స్ తన చెల్లెలు నేను ప్రేమించుకున్నామని కూడా తెలుసు.  ఇన్‌ఫాక్ట్ తను కూడా ఇష్టపడ్డాడు నేను తన చెల్లెల్ని చేసుకుంటే ఆమె జీవితం బాగుంటుందని, ప్రేమిస్తున్నవాడు తనని సుఖపెడతాడని.  మనం ప్రేమించే వాళ్ళని కోల్పోయినా ఫరవాలేదు కాని మనల్ని ప్రేమించే వాళ్ళని కోల్పోకూడదని తన చెల్లెలికి విడమరిచి మరీ చెప్పాడు.  

ఫ్లాప్ ఒపెన్ చేసి కార్డ్ బయటకు తీసాను.  చక్కటి గోల్డెన్ ఎల్లో రంగు.  పీకాక్ బ్లూ లో తన పేరు.  ఒంట్లోని రక్తం అంతా ఒక్కసారిగా నా కళ్ళలోకి చేరుకుంది. ఉన్న నీరసం అంతా ఆవిరైపోయింది.  ఎడవ చేతి బొటన వ్రేలితో తన పేరుని నిమిరాను.  ఆ స్పర్శ  దాదాపు పాతిక వసంతాలు వెనక్కి తీసుకువెళ్ళింది.  ఆ బొటన వేలిలోని ప్రతి రిడ్జ్ కి తను తెలుసు.  తను నాది కావల్సింది.  కాలేదు.  వాడు నా కొడుకు కావల్సింది.  కాలేదు.  తన పేరు పక్కన నాగరాజుది.  నాకేమనిపించలేదు.  మరో నాలుగు అక్షరాలు.  అంతే.  మనసునిండా వెలితి సాయంత్రపు నీడల్లాగా.  చీకట్లోకి.

దివాకర్ పెళ్ళి.  దివాకర్ నా మరదలి రెండో కొడుకు.  నాగ రాజు నా మరదలి భర్త.  నా మరదలు నేను ప్రేమించుకున్నాం.  పెళ్ళి చేసుకుందాం అని కూడా అనుకున్నాం.  మా ప్రపంచంలో మా ప్రేమ తెలియని వాళ్ళూ లేరు.  అందరూ మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళే.  సినిమా టికెట్లు కొనిచ్చినవారే. మామధ్య కాకుండా, మా పక్కన కూర్చునవారే! మమ్మల్ని ఒంటరిగా వదిలేసిన వారే.  కాని తనని చేసుకోలేక పొయ్యాను.  తన పెళ్ళీ అయ్యేదాకా ఆగుతానని అన్నాను.  లేదు మాట ఇచ్చాను అని అనుకున్నాను.  నేను అనుకోగానే సరా?  ఐనా  అగాను. నేను ఇందాక అన్నాను గా. అందరికి తెలుసు అని.  అందుకనే ఆగాను.  తెలిసిన తరువాత ఎవరూ చేసుకోకపోతే?  నేను తొందరపడి చేసేసుకుంటే.  తనకి పెళ్ళి కాకపోతే? అందుకనే అగాను.

తను ఆగ లేదు.  చేసుకుంది.  నాగ రాజుని.  పెద్దలు కుదిర్చిన సంబంధమే! ఏమనుకున్నారో ఏమో! కనీసం మాకు ఆహ్వానం కూడా లేదు.  తరువాత చాలా సార్లు తనని చూసాను దూరం నుండే.  నాగరాజుని కూడా చూసాను.  ఏదో ఫామిలి ఫంక్షన్స్ లో, ఒకసారి అతనిని నాకు, తన తోడళ్ళుడు పరిచయం కూడా చేసాడు.    అన్నీ బాగుండి ఉంటే దివాకర్ నా కొడుకు అయ్యేవాడు.  మేమిద్దరం ఆ శుభలేఖని అందరికి మా స్వహస్తాలతో ఇచ్చి ఉండేవారం.  నాకు తెలుసు ..నా మరదలు తన కొడుకు పెళ్ళి కి నేను వస్తానని ఎదురుచూస్తూ ఉంటూంది..ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తూ ఉంటుంది.  అని నేను కలలు కనటం లేదు.  తనే అంది,” నిన్నేలా మరిచి పోతాను బావా?” అని.

కాని నేను వెళ్ళను..వెళ్ళాలని ఉంది, కాని వెళ్ళను.తనని చూడాలని ఉంది..కాని వెళ్ళను..మొన్న ఇంకొక కజిన్ కూడా అడిగాడు..”.. కొడుకు పెళ్ళి” కి వస్తున్నావా అని రావటం లేదని చెప్పాను. వెళ్ళాలని ఉంది, వెళ్ళి  తనని చూడాలని ఉంది, కాని వెళ్ళేలేదు నేను.  తరువాత గుర్తొచ్చింది.దివాకర్ రెండో వాడు కాదు.  పెద్ద కొడుకు.  ఏమో బతికి ఉంటే, అవకాశం ఉంటే రెండో వాడి పెళ్ళి కి వెడతానేమో? ఏమో?

పెద్దా కి వెడ్డింగ్ గ్రీటింగ్స్ ఈ మైల్ చేసాను.  దివాకర్ కి అవి అందజేయమని.  దివాకర్ కి నేనెవర్నో గుర్తుకూడా ఉండి ఉండదు.  వాడి తమ్ముడికైతే సరే సరి.  వాడు నాకు గుర్తున్నాడు కాని వాడికి నేను గుర్తున్నానా?

అవును, నా కొడుకు కూడా పెళ్ళీడుకు వచ్చాడు. తనని వాడి పెళ్ళి కి నేను వెళ్ళీ అహ్వానిస్తే వస్తుందా?

ఇలా ఆలోచించటం, వెళ్ళటం భావ్యమేనా?

ప్రకటనలు