భాగ్యం తృప్తి

*అరుణమ్ లో “మనబొమ్మలేమవుతాయో” చదివినతరువాత..

శుక్రవారం చాల మంది తెలుగు ఆడపడుచులు లాగానే నా భార్య కూడా తలంటుకుంటుంది. బయటున్నా సరే. దేవుడు, దెయ్యం, మడి నమ్మకాలు లేక కాదు. శుభ్రం గా ఉండాలని. అలాంటి ఒకానొక శుక్రవారం నేను ఇంట్లో నే ఉండటం తటస్థించింది. తడిసిన జుట్టుని ఆరబెట్టుకుంటూ, దువ్వెన తో దువ్వుకుంటూ, ముడిపడిన కేశాలను సరిజేసుకుంటూ, ఊడిపోయిన జుత్తుని తన వేళ్ళకు చుట్టు కుంటున్నది. అలా చుట్టుకుంటూ, స్నానాల గదిలోకి వెళ్తున్నది. మళ్ళీ బయటకు వచ్చేటప్పడికి చేతిలో ఆ ఊడిపోయిన వెంట్రుకలు కనపడటంలేదు. అలాగని స్నానాల గదిలో వాటిని పడెయ్యడానికి అక్కడ బుట్ట లాంటిది ఏమి లేదు. ఇక కుతూహలం ఆపుకోలేక,” భాగ్యం, ఏం చేస్తున్నావు, ఆ ఊడిపోయిన వెంట్రుకలతో?” అని అడిగాను.

తువ్వాలుతో జుత్తుని తుడుచుకుంటునే నా వంక చూస్తు నవ్వుతూ , “ఉండండి “, అంటూ మళ్ళీ‌ఆ గదిలోకి వెళ్ళి వచ్చింది. ఈ సారి తన చేతిలో ఒక ప్లాస్టిక్ సంచి – దాని నిండా వెంట్రుకలు. “ఏవిటది” అన్నట్టు ప్రశ్నార్ధకంగా ముఖం బెట్టాను. “నా ఊడిపోయిన జుత్తండి, ఇది. అప్పడప్పుడు మన కాలనీలోకి ప్లాస్టిక్ బొమ్మలమ్మే వాడు వస్తాడు కదా. వాడు ఈ జుత్తు తీసుకుని పిల్లల బొమ్మలిస్తాడు. అవి నేను మన (మన అంటే ఆవిడ స్వగ్రామం లెండి , మాఊరు ఆవిడ ఊరు కాదులేండి – ఈ భార్యలందరూ ఇంతేనేమో!) ఊళ్ళో కృష్ణ పిల్లలకిస్తాను. వాళ్ళ కళ్ళలో ఆ సంతోషం చూస్తే నాకు భలే ఆనందం వేస్తుందండి.” “సరేలే, అది బానే ఉంది, ఆ ఊడిపోయిన జుట్టుతో ఎందుకు? డబ్బులిచ్చి కొనివ్వచ్చుగా?” “నిజమే, కాని ఎందుకో నాకు వీటికి బదులుగా వచ్చిన బొమ్మలిస్తేనే బాగుంటుందని పిస్తుంది. నా జుత్తు వాళ్ళకి బొమ్మలివ్వడానికి కూడా పనికి వస్తుంది కదా అనిపిస్తుంది. డబ్బుతో కొనేవి ఎలాగు కొంటునే ఉన్నాను కదా.” డబ్బుని ఆదా చెయ్యడమో, మిగల్చడమో కాదు.  ఇక్కడ తృప్తి. నా భాగ్యం కళ్ళల్లో కనపడుతున్న తృప్తి.

ప్రకటనలు